నల్గొండ జడ్పీలో ప్రొటోకాల్ రభస

నల్గొండ జడ్పీలో ప్రొటోకాల్ రభస

నల్లగొండ: జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఎంపీ లు వర్సెస్ ఎమ్మెల్యే మధ్య ప్రోటోకాల్ విషయంలో రభస చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఎంపీలు కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మధ్య వాగ్వాదం సమావేశంలో వేడి పుట్టించింది. కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పద్ధతులు పాటించాలని ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తావించగా.. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి స్పందించి మేము ప్రోటోకాల్ అమలు చేస్తున్నామని, ఏ సభ్యున్ని అయినా గౌరవించాల్సిందే అంటూ.. గతంలో వాళ్లకు ఆ సంస్కృతి లేదన్న వ్యంగ్యంగా అన్నారు. మేము ప్రొటోకాల్ పద్ధతులు మిస్స్ కానివ్వమని, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అసహనం వ్యక్తం చేయగా.. ప్రోటోకాల్ పద్ధతులు పాటించాలనే మేము అధికారులను కోరామన్నారు ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
హైదరాబాద్ –విజయవాడ వయా చిట్యాల, జగ్గయ్యపేట మధ్య కొత్త రైల్వే లైన్ 
జాతీయ రహదారి -65పై రద్దీ రోజు రోజుకూ పెరుగుతున్నందున హైదరాబాద్ నుంచి విజయవాడకు వయా చిట్యాల, జగ్గయ్యపేట మీదుగా కొత్త రైల్వే లైన్ వేసి బుల్లెట్ రైలు, శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైళ్లను నడపాలని ప్రధాన మంత్రికి తెలియజేయబోతున్నామని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. నల్గొండలోని తన నివాసంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్-విజయవాడ మధ్య కొత్త రైల్వే లైన్ ఏర్పాటు చేస్తే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో మేలుతో పాటు అభివృద్ధి జరుగుతుందన్నారు. అలాగే హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారి ఆరు లైన్ల విస్తరణ పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. ఉమ్మడి జిల్లాలో కొన్ని చోట్ల రాజకీయ ఒత్తిళ్ళతో పార్లమెంట్ సభ్యులకు ప్రోటోకాల్ విషయంలో సముచిత స్థానం ఇవ్వడం లేదని, మమ్మల్ని చిన్నచూపు చూడడం మంచిది కాదని హితవు పలికారు. కరోనా నిర్దారణకై ఆర్టీపీసీఆర్ టెస్టులే చేయాలన్నారు. వ్యాక్సిన్ కూడా పూర్తి స్థాయిలో ఇవ్వాలని పార్లమెంట్లోనూ ప్రస్తావిస్తానన్నారు.  తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల భారత దేశంలోనే పంట భీమాలేని రాష్ట్రంగా తెలంగాణ మిగిలిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా, గోదావరి నదీ జలాల విషయంలో సీఎం కేసీఆర్ అసమర్థత వల్ల కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని తెలంగాణకు నష్టం జరిగేలా నోటిఫికేషన్ ఇచ్చిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు.